జీ20కి ముందు భారత్ కీలక నిర్ణయం.. అమెరికా వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత

-

ఈనెల 9,10వ తేదీల్లో భారత్ వేదికగా దిల్లీలో జీ-20 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు. ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అయితే జీ-20 సమావేశాల వేళ భారత్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు అరడజను అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలను ఎత్తివేసింది. బైడెన్-మోదీల భేటీ ముందు భారత్‌ తాజా నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

భారత్ అదనపు సుంకం ఎత్తివేసిన ఉత్పత్తుల్లో శెనగలు, ఉలవలు, యాపిళ్లు, వాల్‌నట్స్‌, బాదం ఉన్నాయి. 2019లో భారత ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లను పెంచింది. దీనికి బదులుగా పలు ఉత్పత్తులపై భారత్‌ సైతం అదనపు సుంకాలు విధించింది. వాటిలో కొన్నింటికి తాజాగా మినహాయింపునిచ్చింది.

ప్రధాని మోదీ జూన్‌లో అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దాదాపు ఆరు ఆంశాల్లో నెలకొన్న వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. అందులో తాజాగా రద్దు చేసిన అదనపు సుంకాల అంశం సైతం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news