పేదరికం పై పోరులో వచ్చే పదేళ్లు చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సమిష్టి కృషితో ఈ పోరులో దేశ ప్రజలు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేసారు. పదేళ్ల ప్రధానిగా అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని పేర్కొన్నారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన రోజున ఆ ప్రభావం ప్రజల జీవితాలపై ఉంటుందన్నారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ కోసం చేస్తున్న కృషికి మద్దతుగా ప్రజలు తమను మూడోసారి గెలిపించారని తెలిపారు.
దాదాపు పదేళ్లుగా సేవాభావంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేసేవారినే ప్రజలు ఆశీర్వదించారని పునరుద్ఘాటించారు. ఎన్డీఏ పాలనను దేశ ప్రజలు మరోసారి సమర్థించారని పేర్కొన్నారు. రాజ్యాంగం ఆర్టికల్స్ అనుసరించేందుకే పరిమితం కాదని.. రాజ్యాంగం లైట్ హౌస్‌లా మార్గనిర్దేశం చేస్తుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ భావనను విద్యా సంస్థల్లో విద్యార్థులకు చేరవేస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోందన్న ప్రధాని.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.