ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత్ మరోసారి స్పందించింది. ఈ కేసులో భారతీయులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని, ఈ అంశంలో నిర్దిష్టంగా ఎలాంటి ఆధారాలను, సమాచారాన్ని మాత్రం అందించలేదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
ఈ కేసులో రాజకీయ ప్రయోజనాలు పని చేస్తున్నట్లున్నాయని రణ్ధీర్ అన్నారు. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను ప్రేరేపించేవారికి రాజకీయ వేదికలు కల్పించొద్దని తాము చాలా కాలంగా కోరుతున్నామని తెలిపారు. కెనడాలో భారత దౌత్యవేత్తలను బెదిరిస్తున్నారని, వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ భారత్‌తో సంబంధాలు ఉన్నవారు కెనడాలో ప్రవేశించడానికి, అక్కడ నివసించడానికి అనుమతిస్తున్నారని మండిపడ్డారు. నేరగాళ్ల అప్పగింత కోసం ఆ దేశానికి అనేక విజ్ఞప్తులు చేశామని.. అవి అక్కడ పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ అంశాలన్నింటిపై కెనడాతో దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నామని రణధీర్ పేర్కొన్నారు.