కరోనా నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్తంగా కలిసి రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్‌లో ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్‌కు గాను ఇప్పటికే 3వ దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి కాగా డ్రంగ్ కంట్రోల్ విభాగానికి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గాను సీరమ్ ఇనిస్టిట్యూట్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే సంబంధిత విభాగం నుంచి అనుమతి కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పటికే తొలి దశ పంపిణీ కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ 5 కోట్ల డోసులను సిద్ధంగా ఉంచింది. అనుమతి రాగానే వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలోనే జనవరి 2021 తొలి వారంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తుందని తెలుస్తోంది. కాగా ఇదే విషయంపై సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తాజాగా జరిగిన ఓ సమావేశంలో వివరాలను వెల్లడించారు.
మరికొద్ది రోజుల్లో భారత దేశ ప్రజలు శుభవార్త వినే అవకాశం ఉందని పూనావాలా అన్నారు. కొద్ది రోజుల్లో.. అంటే కొత్త ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్‌కు అనుమతి వచ్చేందుకు అవకాశం ఉందని అన్నారు. కాగా ప్రధాని మోదీ కూడా ఇప్పటికే హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పరిశోధన కేంద్రాన్ని, పూణెలోని కోవిషీల్డ్ ల్యాబ్‌ను సందర్శించి వ్యాక్సిన్ తయారీ గురించి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లో మరికొద్ది రోజుల్లో కోవిషీల్డ్‌కు అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. ఇక ఫిబ్రవరి నెలలో భారత్ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే కోవిషీల్డ్‌కు అనుమతి వచ్చిన వెంటనే ఉత్పత్తిని గణనీయంగా పెంచుతామని పూనావాలా తెలిపారు. మార్చి వరకు 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని, అదే జూన్ వరకు అయితే 30 కోట్ల డోసులను సిద్ధం చేస్తామని తెలిపారు. ముందుగా భారత్‌కు వ్యాక్సిన్‌ను పంపిణీ చేశాకే ఇతర దేశాలకు పంపిస్తామని అన్నారు. అయితే వచ్చ ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్ డోసులకు కొరత వచ్చేందుకు అవకాశం ఉందని, కానీ సెప్టెంబర్ వరకు ఇతర వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయి కనుక అప్పటికి డిమాండ్ కొంత వరకు తగ్గేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.