ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతలు భారత్‌లోనే ఎక్కువ.. కాంగ్రెస్‌ ఎంపీ

-

ఎన్డీయే ప్రభుత్వ హయాంలో గత నాలుగేళ్లలో (2018-21) ప్రపంచంలోనే అత్యధికంగా అంతర్జాల సేవల నిలిపివేత సంఘటనలు భారత్‌లోనే నమోదయ్యాయని అస్సాంకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ ప్రద్యుత్‌ బోర్డోలోయ్‌ ఆరోపించారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా 182 ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు అయితే భారత్‌లోనే 106 ఉన్నాయని ఎంపీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు.

ఇంటర్నెట్‌ సస్పెన్షన్‌ల నియంత్రణకు కేంద్రం ఏదైనా చట్టం రూపొందిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. శాంతిభద్రతల సవాళ్లకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం సమర్థనీయం కాదన్నారు. ఇది హక్కుల ఉల్లంఘనేనని, ఏ ప్రజాస్వామ్య సమాజంలో.. ముఖ్యంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఇది ఆమోదయోగ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. పైగా ఇంటర్నెట్ షట్‌డౌన్‌లపై సమాచారాన్ని అందించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం మణిపూర్‌లోనూ ఐదు రోజుల ఇంటర్నెట్‌ బంద్‌ కొనసాగుతోందని గుర్తుచేశారు.

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పౌర హక్కుల పరిరక్షణకు పనిచేసే ‘యాక్సెస్ నౌ’ సంస్థ నిర్వహించిన స్వతంత్ర అధ్యయనం ప్రకారం 2021 నాటికి వరుసగా నాలుగో ఏడాదీ అత్యధిక ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు భారత్‌ నమోదు అయ్యాయి. పౌర స్వేచ్ఛ, సాంకేతిక, మేధో సంపత్తి హక్కుల చట్టాలకు సంబంధించిన అంశాల్లో సేవలందించే ‘సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్’ అధ్యయనం ప్రకారం.. భారత్‌లో 2014లో ఆరుసార్లు ఇంటర్నెట్‌ సేవలు నిలిపేయగా.. 2018 తర్వాత ఈ సంఖ్య ఏటా 100కు పైగా పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version