రాజస్థాన్‌లోని చిత్తౌడగఢ్ జిల్లాలో వందేభారత్ రైలుకు భారీ ప్రమాదం తప్పింది. పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లు, రాళ్లను ఉంచారు. లోకోపైలట్ వీటిని ముందే గుర్తించడంతో ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 7.50 గంటలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయ్‌పుర్ నుంచి జైపుర్‌కు బయలుదేరింది. భిల్వాడా రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే లోకో పైలట్ పట్టాలపై రాడ్లు, రాళ్లు గుర్తించి. . వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. కిందకు దిగి రైలు పట్టాలను పరిశీలించగా.. పట్టాలపై రాళ్లతోపాటు ఇనుపరాడ్లను గమనించారు. కొన్నిచోట్ల రాళ్లు కదలకుండా ఇనుపరాడ్లు కూడా ఉంచారు.
ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా లేక కావాలనే చేశారా.. దీనివెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమయస్ఫూర్తితో లోకోపైలట్ ప్రమాదాన్ని గుర్తించి తమ ప్రాణాలు కాపాడటంతో ప్రయాణికులు లోకోపైలట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.