ఉత్తర భారతంలో వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఏకధాటి వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు, చెరువులు.. జలమయమైన రహదారులు.. జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు.. విరిగిపడుతున్న కొండచరియలతో ఉత్తరాది అస్తవ్యస్తమవుతోంది. అయితే ఈ వరదల్లో 100కు పైగా ఇజ్రాయెల్ పర్యాటకులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారత్ పర్యటనకు వచ్చిన 100 మందికి పైగా ఇజ్రాయెల్ పర్యాటకులు భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. ఆందోళనకు గురైన వారి బంధువులు బాధితులతో సంప్రదించేందుకు యత్నిస్తుండగా.. సాధ్యం కావడంలేదని అధికారులు పేర్కొన్నారు. ‘‘వీటిపై కొద్ది సేపటి నుంచి మాకు చాలా అభ్యర్థనలు వస్తున్నాయి’’ అని వెల్లడించారు.
భారత్‌లో చాలా చోట్ల వర్షాలకు కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి తలెత్తిందని దిల్లీలోని ఇజ్రాయెల్ కాన్సులెట్ భావిస్తోంది. భారత్‌లోని అధికారులతో కలిసి పర్యాటకుల జాడను గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. తమ దేశస్థులకు ప్రమాదం జరిగినట్లు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లభించలేదని పేర్కొంది.