భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ మిషన్ గగన్ యాన్ పై కీలక ప్రకటన చేశారు. అంతరిక్షానికి మనిషిని పంపించే లక్ష్యంగా మొట్టమొదటి మానవ సహిత మిషన్ గగన్ యాన్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్టు 2025లో కాకుండా ఈ మిషన్ ను 2026లో చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ మెమొరియల్ లెక్చర్ సందర్భంగా ఈ వివరాలను వెల్లడించారు సోమనాథ్.
చంద్రయాన్ -3 మిషన్ ఆదిత్య ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో అదేబాటలో తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్ యాన్ యాత్రను చేపట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి మూడు రోజుల పాటు పంపి.. సురక్షితంగా వారిని భూమి పైకి తేవడమే ఈ మిషన్ లక్ష్యం. వాస్తవానికి 2022లోనే ఈ ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉండగా.. కరోనా వల్ల ఆలస్యమైందని తెలిపారు. ఈ మిషన్ విజయవంతం అయితే అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తరువాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది.