గోవా వేదికగా శుక్రవాం రోజున షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొనడానికి పాక్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ వచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే పాక్ మంత్రి సాక్షిగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దాయాదిపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ సదస్సు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్టికల్ 370పై మాట్లాడారు.
ఎస్సీవో సదస్సుకు వచ్చిన బిలావల్‌ను తాము ఓ సభ్యత్వ దేశ మంత్రిగానే చూస్తున్నామని.. అంతకుమించి ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జైశంకర్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణం 370 రద్దుపై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘370 ముగిసిన చరిత్ర. ఆ విషయాన్ని పాక్ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది’’ అని పేర్కొన్నారు. మరోవైపు చైనాతో సంబంధాల గురించి మాట్లాడుతూ.. డ్రాగన్‌తో సంబంధాలు సాధారణంగా లేవని అంగీకరించారు. సరిహద్దుల్లో ఉపసంహరణ ప్రక్రియ ముందుకు వెళితేనే, శాంతి నెలకొంటుందని.. అంతవరకు పరిస్థితులు మెరుగుపడవని స్పష్టం చేశారు.