నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో బుధవారం దిల్లీలో జరగాల్సిన జలశక్తి శాఖ సమావేశం వాయిదా పడింది. తుపాను కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ రెండు రాష్ట్రాలు, కృష్ణా బోర్డుకు సమాచారం అందించింది. ఇప్పటికే మూడో తారీఖున జరగాల్సిన సమావేశం ఆరోజు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉండటంతో వాయిదా వేశారు. ఇక తదుపరి సమావేశం 6వ తేదీన ఉంటుందని ప్రకటించగా.. ఇప్పుడు తుపాను ప్రభావంతో మరోసారి వాయిదా పడింది.
అయితే ఈనెల 2వ తేదీన జరిగిన సమావేశంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, అనుబంధ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం తరఫు నుంచి ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి నీటి అవసరాలు, అభ్యంతరాలను జలశక్తి శాఖ అధికారులకు వివరించారు. గతంలో కేఆర్ఎంబీకి రాసిన అంశాలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టులోని విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ నిర్వహించుకుంటున్న అంశాలను తెలిపారు. కరెంట్ ఉత్పత్తికి తెలంగాణ నీటిని వినియోగించుకుంటున్న విషయాలను కూడా జలశక్తి శాఖ దృష్టికి ఆయన తీసుకువచ్చారు.