రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌లకు చివరితేదీ సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొన్నది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇవాళ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ ప్రకటించబోయే ఆ మూడు పేర్లలో మరోసారి జయాబచ్చన్ పేరు కూడా ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే జయాబచ్చన్ పదవీకాలం ముగియడంతో ఆమెకు రాజ్యసభ వీడ్కోలు పలికింది. ఆ సందర్భంగా చివరి ప్రసంగం చేసిన ఆమె రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు, తోటి సభ్యులకు క్షమాపణలు చెప్పారు. ఒకానొక సందర్భంలో చైర్మన్‌పట్ల దురుసుగా వ్యవహరించానని, అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించనని, తన స్వభావమే అంత అని చెప్పారు.
చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు క్షమాపణలు తెలిపారు. తన ప్రవర్తనతో తోటి సభ్యులు కూడా ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరారు. ఇదిలావుంటే రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు సమాజ్‌వాదీపార్టీ కార్యాలయంలో ఇవాళ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అదేవిధంగా ఏ సభ్యుడు ఏ అభ్యర్థికి ఓటు వేయాలనే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, రాజ్యసభకు నామినేషన్ల గడువు ఫిబ్రవరి 15తో ముగియనుండగా.. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.