భాజపాతో నితీశ్​ కటీఫ్‌.. మళ్లీ ఆర్జేడీ, కాంగ్రెస్​లతో జత కట్టేనా..?

-

తన రాజకీయ మనుగడకు భారతీయ జనతా పార్టీ నుంచి ముప్పుందని భావిస్తున్న బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యు)నేత నీతీశ్‌ కుమార్‌…ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగే యోచనలో ఉన్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి తానే నేతృత్వం వహిస్తున్నప్పటికీ పలు అంశాల్లో మాట చెల్లుబాటుకావడంలేదనే ఆవేదనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా కేంద్ర మాజీ మంత్రి, జేడీ(యు) నేత ఆర్సీపీ సింగ్‌ పార్టీకి రాజీనామా చేసి నీతీశ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో ఆయన ఏకైక జేడీ(యు) మంత్రి. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేశారు. భాజపా నేతలకు అత్యంత సన్నిహితుడు కూడా అయిన ఆర్సీపీ సింగ్‌ను అడ్డుపెట్టుకుని జేడీ(యు)ను చీల్చే అవకాశం ఉందనే అనుమానాలు తాజా రాజకీయ పరిణామాలకు తక్షణ కారణంగా ఉన్నాయి.

బిహార్‌ అసెంబ్లీలో జేడీ(యు)కు 43 మంది ఎమ్మెల్యేలున్నారు. కమలం పార్టీకి 77 మంది ఎమ్మెల్యేలు(ఇటీవల ముగ్గురు ఇతర పార్టీ సభ్యుల చేరికతో) ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వానికి నీతీశ్‌ సారథ్యం వహిస్తున్నారు. అయితే, తనను రాజకీయంగా బలహీనపరుస్తున్న భాజపా నేతలు ఎంతో కాలం ఆ పదవిలో కొనసాగనివ్వబోరన్న అభిప్రాయంతో నీతీశ్‌ ఉన్నారని సమాచారం. భాజపాతో దూరం పెరుగుతుందని స్పష్టమవుతున్న నేపథ్యంలో మంగళవారం జేడీ(యు) ఎమ్మెల్యేల, ఎంపీల సమావేశానికి నీతీశ్‌ పిలుపునిచ్చారు. కమలదళంతో కలిసి కొనసాగడంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నీతీశ్‌ కుమార్‌ ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాతో ఫోన్‌లో మాట్లాడారని రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. మరోవైపున పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటున్న ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఎంపీలు బిహార్‌కు చేరుకుంటున్నారు.

జేడీ(యు)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్‌ తివారీ తెలిపారు. భాజపాతో నీతీశ్‌ సంబంధాలు తెంచుకుంటే మద్దతిస్తామని ప్రకటించారు. గతంలో నీతీశ్‌ తమను వీడి కమలదళం చెంతకు వెళ్లినప్పటికీ భాజపాను అధికారం నుంచి దూరంగా ఉంచేందుకు కలిసి పనిచేస్తామన్నారు. ఆర్జేడీకి అసెంబ్లీలో 75 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలకు కలిపి మరో 35 మంది సభ్యులున్నారు. ‘జేడీ(యు), ఆర్జేడీ పార్టీలు కలిస్తే అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం ఉంటుంద’ని శివానంద్‌ తెలిపారు.

తాజా పరిణామాలపై బిహార్‌ రాష్ట్ర భాజపా నేతలు నోరు విప్పడం లేదు. ఇటీవల పట్నా వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా..2024 సార్వత్రిక ఎన్నికలు, 2025లో జరిగే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యు)తోనే కలిసి సాగుతామని స్పష్టంగా చెప్పారని భాజపా నేత ఒకరు వెల్లడించారు. మిత్ర ధర్మానికే కట్టుబడి ఉన్నామన్నారు. నీతీశ్‌ నిర్ణయం తీసుకునే వరకూ వేచిచూస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news