జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. జీలం నదిలో పడవ బోల్తా పడి అందులోని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది నదిలో గల్లంతయ్యారు. మృతుల్లో నలుగురు పాఠశాల చిన్నారులే ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ముగ్గురిని ప్రాణాలతో బయటకు తీసినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో బోటులో 20 మందికి పైగా ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు.
బోటును ఒడ్డుకు లాగుతున్న సమయంలో దానికి కట్టి ఉన్న తాడు ఒక్కసారిగా తెగడంతో పడవ బోల్తా పడినట్లు సమాచారం. గల్లంతైన వారికోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జీలం సహా పలు నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
గత దశాబ్ద కాలంగా గాంద్బాల్ నుంచి శ్రీనగర్ను కలిపే వంతెన నిర్మాణం జరుగుతోందని, దీంతో ప్రజలు నదిని దాటాలంటే పడవలను ఆశ్రయించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. ఈ వంతెనను నిర్మించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అన్నారు.