కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొంది. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కొరతతో నగరవాసులు తిప్పలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్ర స్థాయిలో ఉంది. నీటి సమస్యపై తాజాగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ప్రస్తుతం బెంగళూరు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతోందని, తన ఇంట్లోని బోరు బావి కూడా ఎండిపోయిందని తెలిపారు. నీటి డిమాండ్ తీర్చడానికి కాంగ్రెస్ సర్కారు తీవ్రంగా యత్నిస్తోందని వెల్లడించారు. పట్టణాలకు 15 కిలోమీటర్ల పరిధిలోని వనరులను వినియోగించుకుని నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.
కొన్ని ట్యాంకర్లు రూ. 600కు నీటి సరఫరా చేస్తుండగా.. మరికొన్ని రూ.3 వేల వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయని.. నీటి ధరలను ప్రామాణికంగా ఉంచేందుకు అన్ని నీటి ట్యాంకర్ల యజమానులు అధికారుల వద్ద వివరాలను నమోదు చేసుకోవాలని కోరినట్లు డీకే తెలిపారు. ప్రయాణించే దూరాన్ని బట్టి ధర ఉంటుందని డీకే శివకుమార్ చెప్పారు.