తిరుపతిలోని తిరుమల, తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నడిచే పలు విద్యా సంస్థల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 31న నోటిఫికేషన్ విడుదలైంది. టీటీడీకి చెందిన వివిధ డిగ్రీ కళాశాలలు/ఓరియంటల్ కాలేజీల్లో 49 లెక్చరర్ల పోస్టులు; తితిదే జూనియర్ కాలేజీల్లో 29 జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నియమించనున్నారు. అయితే, తొలుత జూనియర్ లెక్చరర్ పోస్టులకు మార్చి 5వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
నోటిఫికేషన్‌లోని కొన్ని ముఖ్యాంశాలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు మార్చి 5 నుంచి మార్చి 25 అర్ధరాత్రి 11.9గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మార్చి 7 నుంచి మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి: జులై 1, 2023 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఇచ్చారు.
జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.
డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మంచి అకడమిక్ రికార్డుతో పాటు 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు నెట్/స్లెట్ అర్హత తప్పనిసరి.
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250. ఇతరులకైతే రూ.370.