లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ్టితో ఆయన ఈడీ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు కేజ్రీవాల్ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈనెల 22 నుంచి ఇవాళ్టి వరకు ఆయన కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీ నుంచే ఆయన పాలన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు దిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన నిజానిజాలను తన భర్త అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు కోర్టులోనే చెబుతారని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వాస్తవాలన్నింటినీ ఆయన ఈరోజు న్యాయమూర్తి ముందు బయటపెడతారని వెల్లడించారు. ఈ కుంభకోణం డబ్బులు ఎక్కడున్నాయనే వివరాలతోపాటు పూర్తి ఆధారాలు సమర్పిస్తారని చెప్పడంతో ఇవాళ ఏం జరుగుతుందోనని సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.