మద్యం పాలసీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్-ఈడీ విచారణకు దిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకావడం లేదని ఆప్ వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించనున్నారని పేర్కొన్నాయి. దిల్లీ మద్యం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులు చట్ట విరుద్ధమనీ రాజకీయ ప్రేరేపితమైనవని అంతకుముందు కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే తనకు ఈడీ నోటీసు పంపిందని ఆరోపించారు.
నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకునేందుకే కాషాయ దళం ఈ కుట్ర పన్నిందని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన కేజ్రీవాల్……ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. అంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్ లో సీబీఐ ఆయనను మద్యం కుంభకోణం కేసులో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది.