తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో మూడో రోజు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లారు. బ్యారేజ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూసేందుకే వచ్చానని తెలిపారు. ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రజల ధనం రూ.లక్ష కోట్లు దోపిడీ జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరంపై ఇక్కడ ఉన్నవాళ్లు బీఆర్ఎస్ ఏటీఎం అని చెబుతున్నారని రాహుల్ అన్నారు. కాళేశ్వరం బీఆర్ఎస్‌కు ఏటీఎం కాదు కేసీఆర్ ఏటీఎం అని తాను చెబుతున్నానని పేర్కొన్నారు.
“కేసీఆర్ ప్రజల సంపదను దోచుకున్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును మళ్లీ ప్రజల ఖాతాల్లోనే వేయిస్తాం. అధికారంలోకి రాగానే ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.2,500 వేస్తాం. కేసీఆర్ పాలనలో సిలిండర్ ధర రూ.వెయ్యి.. మేము వస్తే రూ.500కే ఇస్తాం. బస్సుల్లో తిరగడానికి సగటున మీకు రూ.1000 ఖర్చవుతోంది. కాంగ్రెస్ రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. మేము ఏర్పాటు చేసేది ప్రజల ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం ద్వారా మహిళలకు నెలకు రూ.4 వేలు ప్రయోజనం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వండి. దొరల సర్కార్‌ను పారద్రోలి ప్రజా సర్కార్‌ను ఏర్పాటు చేస్తాం.” అని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.