ఏపీలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసి.. జనవరి నాటికి ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి రావాలని ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అదేతరహాలో కోలీవుడ్ పాపులర్ హీరో ఇళయదళపతి విజయ్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చాలాకాలం నుంచి అనుకుంటున్నారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలని గట్టిగానే అనుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా ఆయనను రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ సమయంలోనో, మరేదైనా సందర్భంలోనో.. అప్పుడప్పుడూ రాజకీయాలపై ప్రస్తావన చేస్తూనే వచ్చారు విజయ్. దీంతో ఆయనకు పాలిటిక్స్ రావాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు స్పష్టంగానే అర్ధమవుతోంది. అందుకే ఈసారి మాత్రం ఖచ్చితంగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
సినీరంగం నుంచి వచ్చిన ఎంజీఆర్, జయలలిత తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి, రాజకీయాలను శాసించేంతస్థాయి వరకు వెళ్ళారు. ఆ తర్వాత ఆస్థాయిలో నిలదొక్కుకున్న వారు మాత్రం లేరనే చెప్పాలి. శివాజీ గణేశన్, విజయకాంత్ వంటి అగ్రహీరోలు కూడా పార్టీ పెట్టి రాణించలేకపోయారు. ఇక తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ కూడా పార్టీ స్థాపించారు గానీ, ఊగిలసాడుతూ చివరికి చేతులెత్తేశారు. యూనివర్శల్ హీరో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ప్రజా న్యాయ కేంద్రం) పేరుతో పార్టీ స్థాపించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో కమల్ హవా ఎంతమాత్రం పని చేయలేదు.
ఇక ఇప్పుడు ఇళయదళపతి విజయ్ వంతు వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయన.. సమాజ సేవ కోసం తన పేరుతో విజయ్ మక్కల్ ఇయక్కమ్ సంస్థను స్థాపించి ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సంస్థ నిర్వాహకులతో ఈ మధ్య విజయ్ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ఏర్పాటు దిశగా చర్చిస్తున్నారు. తన సంస్థ ద్వారా చేస్తోన్న కార్యకలాపాలను ప్రజలకు చేరువ చేసే దిశగా సోషల్ మీడియా, ఐటీ విభాగాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు ప్రారంభించారు. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి ఖతాలను ప్రారంభించి, వాటిని షేర్ చేయాలని సూచించినట్లు సమాచారం. తద్వారా పొలిటికల్ హీట్ పెంచేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆయన పార్లమెంట్ ఎలక్షన్ బరిలోకి దిగనున్నట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం లియో మూవీలో విజయ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదికాక మరో మూవీ ఆయన చేతిలో ఉంది. వీటిని కంప్లీట్ చేసి, పాలిటిక్స్ పై ఫోకస్ చేయాలని ఇళయ దళపతి మాస్టర్ ప్లాన్.