వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన సమర్థిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ నినాదానికి సంబంధించి కేంద్రం సమాలోచనలు జరుపుతోందన్నారు. అయితే.. ఏ కార్యక్రమం అయినా మా జనసేన నాయకులంతా కలిసి కట్టుగా పని చేస్తున్నారని, రేపు మా అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రేపు చేపడతామన్నారు నాదెండ్ల. రాష్ట్ర వ్యాప్తంగా చక్కటి ఆలోచనతో అన్ని నియోజకవర్గాల్లో పవన్ పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తున్నామని, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇసుక విధానాన్ని మార్చి.. నిర్మాణ రంగాన్ని, కార్మికులను దెబ్బ కొట్టారని, గతంలో డొక్కా సీతమ్మ స్పూర్తితో కార్మికులకు అన్నదానం కార్యక్రమాలు చేశామన్నారు నాదెండ్ల మనోహర్.
అంతేకాకుండా.. ‘పవన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు చేస్తాం. రెల్లి కార్మికులు ఎంతో కష్టపడి సమాజానికి వారు సేవ చేస్తున్నారు. వారి కష్టాన్ని గుర్తించి వారికి అండగా ఉంటామని పవన్ గతంలో చెప్పారు. వారి మధ్య పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుతాం. వివిధ ప్రాంతాలలో రక్తదాన శిబిరాలు నిర్వహించి, స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులలో అందచేస్తాం. మా జనసేన రాష్ట్ర కార్యాలయంలో కూడా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. గుంటూరు జిజీహెచ్ నుంచి వైద్యులు, ఇతర బృందం వస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను సందర్శించి పుస్తకాలు, ఇతర స్టేషనరీ పరికరాలను అందచేస్తాం. జనవాణిలో దివ్యాంగులు చాలా మంది మా అధినేతకు సమస్యలు చెప్పేవారు. మా అధ్యక్షుడిని ఆదర్శంగా తీసుకుని దివ్యాంగులకు మా వంతుగా సేవా కార్యక్రమాలు అందిస్తాం. వారికి చేయూతను ఇచ్చేలా మా జనసైనికులు దత్తత తీసుకుని బాగోగులు చూస్తారు. ఈ ఐదు అంశాలను పరిగణలోకి తీసుకుని రేపు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. యువతకు స్పూర్తి వంతంగా ఉండేలా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తాం.’ అని ఆయన తెలిపారు.