జమిలి ఎన్నికలపై త్వరలో కేంద్రానికి కోవింద్‌ కమిటీ నివేదిక

-

జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ కసరత్తు పూర్తి చేసింది. తుది నివేదికను సిద్ధం చేసిన ఈ కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను అన్వేషించి తగు సిఫార్సులు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో సెప్టెంబర్‌ 2023న ఓ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.

2029 నుంచి ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేలా నిబంధనలను మార్చే విధానాన్ని ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీలతోపాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి ఓటరు జాబితా ఉండాలని సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలతోపాటు రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాల్సిన అవసరం ఉంటుందని ప్రతిపాదించే అవకాశం ఉంది. పార్లమెంటు సభల వ్యవధిపై ఆర్టికల్‌ 83, రాష్ట్రపతి లోక్‌సభ రద్దుపై ఆర్టికల్‌ 85, రాష్ట్ర శాసనసభల వ్యవధికి సంబంధించి ఆర్టికల్‌ 172, రాష్ట్ర శాసనసభల రద్దుపై ఆర్టికల్‌ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి ఆర్టికల్‌ 356 ఇందులో ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version