కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలో నూతన మంత్రివర్గం ఆదివారం రోజున కొలువుదీరింది. ఈ నూతన మంత్రివర్గంలో మొత్తం 72 మంది ప్రధాని మోదీతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మోదీ కొత్త కేబినెట్లో మొత్తం ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. వారిలో ఇద్దరు కేబినెట్ హోదా పొందారు. గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు ఉండగా, ఈ దఫా ఆ సంఖ్య 7కు తగ్గడం గమనార్హం.
గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌తో పాటు బీజేపీ ఎంపీలు అన్నపూర్ణాదేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకుర్, నిముబెన్ బాంభణియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ మంత్రి పదవులు సొంతం చేసుకున్నారు. నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి కేబినెట్ హోదా పొందగా, మిగిలినవారు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.