కేరళలో 99 సీట్లు గెలుచుకున్న ఎల్‌డీఎఫ్.. తిరిగి అధికారంలోకి..!

కేర‌ళ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ(ఎం)) నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్‌) చారిత్రాత్మ‌క విజ‌యం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. కేర‌ళ‌లో ఉన్న మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో ఎల్‌డీఎఫ్‌కు 99 సీట్లు రాగా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్ (యూడీఎఫ్‌)కు 41 సీట్లు వ‌చ్చాయి.

LDF won 99 seats in kerala and retains power

ఇక కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 2016లో బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్‌డీఏ తిరువ‌నంత‌పురంలోని నేమ‌మ్ సీటును మాత్ర‌మే గెలుచుకోగా ఇప్పుడు ఆ సీటును కూడా కోల్పోయింది. ఎల్‌డీఎఫ్‌లోని సీపీఎం 68 స్థానాల్లో విజ‌యం సాధించ‌గా, మిత్ర‌ప‌క్షం సీపీఐ 17 స్థానాల్లో గెలుపొందింది. ఇక కేర‌ళ కాంగ్రెస్ (ఎం) పోటీ చేసిన 12 స్థానాల్లో 5 స్థానాల‌లో విజ‌యం సాధించింది. అలాగే జ‌న‌తా ద‌ళ్ (సెక్యుల‌ర్‌), నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లు చెరో 2 సీట్లు సాధించాయి. లోక్ తాంత్రిక్ జ‌న‌తా దల్ (ఎల్‌జేడీ) పోటీ చేసిన మూడింటిలో ఒక్క సీటును గెలుచుకుంది. కేర‌ళ కాంగ్రెస్ (బి) త‌న సిట్టింగ్ సీటును నిలుపుకుంది. ఇండియ‌న్ నేష‌న‌ల్ లీగ్ (ఐఎన్ఎల్‌), కాంగ్రెస్ (సెక్యుల‌ర్‌) పార్టీలు చెరో సీటును సాధించాయి.

కేర‌ళ‌లో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ 91 స్థానాల్లో పోటీ చేయ‌గా 21 చోట్ల మాత్ర‌మే గెలుపొందింది. యూడీఎఫ్ భాగ‌స్వామి ఇండియ‌న్ యూనియ‌న్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్‌) 27 స్థానాల్లో పోటీ చేసి 15 చోట్ల గెలిచింది. కేర‌ళ కాంగ్రెస్ 2 సీట్ల‌లో గెల‌వ‌గా, కేర‌ళ కాంగ్రెస్ (జేక‌బ్‌), నేష‌న‌ల్ సెక్యుల‌ర్ కాన్ఫ‌రెన్స్, రివ‌ల్యూష‌న‌రీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ఎంపీ) ఒక్కో సీటును గెలుచుకున్నాయి.

పిన‌రయి విజ‌య‌న్ నాయ‌క‌త్వంలోని లెఫ్ట్ కూట‌మి ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీల‌కు పెద్ద షాక్‌ను ఇచ్చింది. బీజేపీలో సీనియ‌ర్ నేత‌లైన కుమ్మ‌న‌మ్ రాజ‌శేఖ‌ర‌న్, రాష్ట్ర అధ్య‌క్షుడు కె.సురేంద్ర‌న్‌, శోభా సురేంద్రన్‌, మెట్రోమాన్ ఇ.శ్రీ‌ధ‌ర‌న్‌లు ఓట‌ముల‌ను చ‌వి చూశారు.

2016 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎల్‌డీఎఫ్ 91 సీట్ల‌ను గెలుచుకోగా ఓటు శాం 43.48గా న‌మోదైంది. యూడీఎఫ్ 47 సీట్ల‌ను గెలుచుకుని 38.81 ఓటు శాతం సాధించింది. ఇక అప్ప‌ట్లో ఎన్‌డీఏ 14.96 ఓటు శాతంతో ఒక్క సీటును సాధించింది.