మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభ లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టింది. దీనికి కేంద్ర ప్రభుత్వం “నారీ శక్తి వందన్” అనే పేరు పెట్టింది. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆవశ్యకతను ఆయన సభకు వివరించారు. దీనిపై రేపు లోక్ సభలో చర్చకు అనుమతిస్తామని స్పీకర్ వెల్లడించారు. అయితే బిల్లు కాపీలు తమకు ఎందుకు ఇవ్వలేదని విపక్షాలు ప్రశ్నించాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
దీంతో డిజిటల్ ఫార్మాట్ లో బిల్లును అప్ లోడ్ చేశామని కేంద్ర ప్రభుత్వం వివరించింది. అనంతరం లోక్ సభను రేపు 11 గంటలకు వాయిదా వేశారు. ఎల్లుండి ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. ఇందుకోసం 128 వ రాజ్యాంగ సవరణ చేయనుంది కేంద్రం. అయితే ఈ బిల్లును ఇప్పుడు ఆమోదించినప్పటికీ 2027 తర్వాత ఇవి అమల్లోకి వస్తాయని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.