హిందూ సంప్రదాయంలో దీపావళి అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. దీపావళి వేడుకలు మొదలయ్యే ముందు వచ్చే రోజు ‘ధన త్రయోదశి’ ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన రోజు. పంచాంగం ప్రకారం కొన్ని తిథులు శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలను కలిగి ఉంటాయి. వాటిలో ధన త్రయోదశి ప్రత్యేక స్థానం పొందింది. ఈ రోజున ఆయుర్వేద దేవత ధన్వంతరి భగవాన్ భూమిపై అవతరించిన రోజు అని పౌరాణిక విశ్వాసం. అందుకే ఆరోగ్యం, ఆయురారోగ్యం, సంపద కోసం ధన త్రయోదశి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు.
నల్లటి చీకట్లను తొలగించి, వెలుగును, సిరిసంపదలను తెచ్చే పండుగల్లో ధన త్రయోదశి (ధన్‌తేరస్)కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్రమైన రోజునే లక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు మీరు చేసే చిన్న చిన్న పనులే మీ ఇంటికి అదృష్టాన్ని, ధనాన్ని పదింతలు పెంచుతాయట! మరి ఈ ధన త్రయోదశి రోజున తప్పక చేయాల్సిన మీ అదృష్టాన్ని మీ వైపు తిప్పుకునే ఆ మూడు ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకుందాం.
ధన త్రయోదశి అనేది ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు సంబంధించిన పండుగ. ఈ రోజున చేసే ఆచారాలు, పూజలు లక్ష్మీదేవి మరియు కుబేరుడి అనుగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తాయి. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన 3 ప్రధాన పనులు తెలుసుకోవటం ముఖ్యం.
సాయంకాలం దీపారాధన (యమ దీపం):ఈ రోజున సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఆరుబయట దీపాలు వెలిగించడం చాలా శుభప్రదం. ఈ దీపావళి పండుగ ఐదు రోజుల ఉత్సవంలో భాగంగా, ధన్‌తేరస్ రోజున ప్రత్యేకంగా యముడి కోసం ఒక దీపం వెలిగిస్తారు. దుమ్ము, ధూళి లేని ప్రదేశంలో ఆవ నూనెతో ఒక మట్టి దీపాన్ని వెలిగించి, దాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణం వైపు ముఖం ఉండేలా ఉంచాలి. ఇది అకాల మరణాల నుండి కుటుంబాన్ని కాపాడుతుందని, ఇంట్లో ధనానికి రక్షణగా నిలుస్తుందని నమ్మకం.

లక్ష్మీ-కుబేర పూజ: ధన త్రయోదశి రోజు సాయంకాలం లక్ష్మీదేవి ధన్వంతరి స్వామి మరియు కుబేరుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఈ పూజలో కొత్తగా కొన్న లోహాలను లేదా ఆభరణాలను ఉంచి పూజించాలి. పూజ సమయంలో “ఓం శ్రీం హ్రీం క్లీం ధనధాన్య సమృద్ధిం దేహి దేహి నమః” వంటి లక్ష్మీ మంత్రాన్ని జపించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి, స్థిరమైన సంపద లభిస్తుంది.
బంగారం లేదా కొత్త పాత్రలు కొనడం:ధన్‌తేరస్ రోజున ఏదైనా కొత్త లోహాన్ని కొనుగోలు చేయడం అత్యంత ముఖ్యమైన ఆచారం. బంగారం, వెండి నాణేలు లేదా ఆభరణాలు కొనడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నిలుస్తాయని నమ్మకం. కొత్త లోహాన్ని కొనుగోలు చేయలేని వారు కనీసం ఒక ఇత్తడి లేదా రాగి పాత్రనైనా కొనాలి. ఈ లోహం ఇంట్లోకి ధనాన్ని తీసుకొస్తుంది మరియు దీర్ఘకాలిక సంపదకు చిహ్నంగా భావిస్తారు.