రెండు రోజుల విరామం తర్వాత సోమవారం పార్లమెంట్ సమావేశాల తిరిగి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ లోక్‌సభ తీర్మానం చేసింది. మరోవైపు నీట్, యూజీసీ, ఎన్‌టీఏ వైఫల్యం, కొత్త క్రిమినల్ చట్టాలపై విపక్షాల వాయిదా తీర్మానం నోటీసులను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు.
అనంతరం లోక్సభలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభలో ఈ తీర్మానంపై చర్చించేదుందుకు లోక్సభ 16 గటంల సమయాన్ని కేటాయించింది. కానీ, నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించాయి. సభలు పునఃప్రారంభం కాగానే విపక్షాలు దీనిపై ఆందోళన వినిపించాయి. ఈ నేపథ్యంలో మొదట రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరపాలని, అనంతరం మిగతా అంశాలపై మాట్లాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పీకర్కు విన్నవించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకుంటూ నీట్ పరీక్ష వ్యవహారంపై మాట్లాడేందుకు ఒకరోజు కేటాయించాలని కోరగా నోటీసులు ఇస్తే దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ అన్నారు.