18వ లోక్‌సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా నామినేషన్ వేశారు. మరోవైపు విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ బరిలో నిలిచారు.
అయితే ప్రతిపక్ష ఇండియా కూటమికి డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇస్తే విపక్షాలు లోక్ సభ స్పీకర్ పదవి ఏకగ్రీవానికి ప్రభుత్వానికి మద్దతు ఇస్తాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కానీ రాహుల్ ప్రతిపాదనపై అధికార పక్షం స్పందించలేదు. దీంతో అధికార పక్షం తీరుపై అసంతృప్తితో ఇండియా కూటమి నేతలు స్పీకర్ పదవికి అభ్యర్థిని పోటీలో నిలపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీ సురేశ్‌ను బరిలోకి దింపారు.