ఈ నెలలో ఇప్పటికే సూర్యగ్రహణం వచ్చిన విషయం తెలిసిందే. కానీ అది భారత్లో మాత్రం కనిపించలేదు. ఇక ఇప్పుడు చంద్రగ్రహణం రానుంది. అక్టోబర్ 28వ తేదీన (శనివారం) అర్ధరాత్రి దాటిన తర్వాత 29వ తేదీన ఆరంభం అవుతుంది. భారత కాలమానం ప్రకారం ఎల్లుండి రాత్రి 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం.. భారత్ సహా.. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, అఫ్ఘాన్ వంటి దేశాల్లో కనిపించనుంది. అయితే ఇప్పుడు ఏర్పడేది పాక్షిక చంద్ర గ్రహణం.
ఈ ఏడాది రెండు ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడడం విశేషం. ఇప్పటికే అక్టోబర్ 14వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నెలలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్ర గ్రహాణాన్ని భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. చంద్రగ్రహణాన్ని ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా కూడా చూడవచ్చని తెలిపారు. టెలిస్కోప్ పరికరం ఉంటే చంద్రగ్రహణ దృశ్యం మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.