ఇటీవల ప్రముఖులు తమ పేర్లు మార్చుకోవడంపై దృష్టి పెట్టారు. జాతకం, న్యూమరాలజీ ప్రకారం తమ పేర్లలో అక్షరాలు తొలగించడమో, కలపడమో చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చేరారు. తన కార్యాలయ నామఫలకంలో తల్లి పేరును చేర్చారు. రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయం ఎదుట ‘ఏక్‌నాథ్ గంగూబాయి సంభాజీ షిండే’ అని రాసి ఉన్న నూతన నామఫలకాన్ని అమర్చారు.
ఇందులో గంగూబాయి ఆయన తల్లి పేరు కాగా, సంభాజీ అన్నది ఆయన తండ్రి పేరు. 2024 మే నెల 1వ తేదీ తర్వాత పుట్టినవారికి జారీ చేసే అన్ని ప్రభుత్వ దస్త్రాల్లో తండ్రి పేరుతో పాటు తల్లి పేరునూ చేర్చాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయించింది. పిల్లలను పెంచి ప్రయోజకులను చేయడంలో తల్లి పాత్రను గుర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సంప్రదాయాన్ని తనతోనే మొదలుపెట్టాలని భావించిన షిండే తల్లి పేరును చేర్చుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్(బీజేపీ), అజిత్ పవార్(ఎన్సీపీ) కూడా వారి కార్యాలయం నామఫలకాల్లో తల్లుల పేర్లను చేర్చారు.