మొన్నటిదాక టమాట ధర సామాన్యులను వణికించింది. ఇక ఇప్పుడేమో ఉల్లి ధర ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరల పెరుగుదులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రం ఉల్లి ధరలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఉల్లి ధరల పెరుగుదలపై కొనుగోలుదారులను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కొనలేనివాళ్లు కొన్నాళ్లు ఉల్లిని తినడం మానేయాలంటూ మహారాష్ట్ర మంత్రి దాదా భూసే ఉచిత సలహానిచ్చారు. ఎక్కువ ధరకు ఉల్లి కొనుగోలు చేయలేని వారు కొన్ని నెలలపాటు వాటిని తినకుంటే ఎలాంటి వ్యత్యాసం ఉండదని పేర్కొన్నారు. రూ.10 లక్షల విలువైన కారును ఉపయోగిస్తున్నప్పుడు.. రిటైల్ ధర కంటే రూ.10- రూ.20 ఎక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేయొచ్చని అన్నారు. ఒకవేళ పెరిగిన ధరల ప్రకారం ఉల్లిని కొనుగోలు చేసే స్థోమత లేకపోతే.. రెండు, మూడు నెలలు వాటిని తినకుంటే ఎలాంటి తేడా ఉండదని అనుచిత వ్యాఖ్యలు చేశారు.