మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్ర ఎన్సీపీలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు.. ఇవాళ తమ బలాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యాయి. పార్టీ ఇరువర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో.. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశాయి.
శరద్ పవార్ నేతృత్వంలో వైబీ చవాన్ సెంటర్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా రావాలని శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవహద్ విప్ జారీ చేశారు. ఈ సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, అజిత్ పవార్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో బాంద్రాలో ఉన్న ముంబయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులు, ఆఫీస్ బేరర్స్, వర్కింగ్ కమిటీ సభ్యులు తప్పినసరిగా హాజరు కావాలని ఎన్సీపీ బహిష్కృత నేత సునీల్ తత్కరే నోటీసులు జారీ చేశారు.