మలేషియా కీలక నిర్ణయం.. వీసా లేకుండానే భారత్‌, చైనాకు సందర్శనకు అనుమతి

-

మలేషియా సర్కార్ భారతీయులకు, చైనీయులకు ఓ తీపికబురు చెప్పింది. పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి చైనా, భారతీయ పౌరులు వీసా లేకుండా మలేషియాలో పర్యటించే వీలుంటుందని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం స్పష్టం చేశారు. తమ దేశం ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి ముఖ్యం అని తెలిపారు.

మలేసియాలోకి ప్రవేశించాక 30 రోజుల పాటు ఉండొచ్చట. భారత్‌, చైనా నుంచి వచ్చే పర్యాటకులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు వీసా సౌకర్యాలను మెరుగుపరుస్తామని గత నెలలోనే మలేసియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఇటీవల థాయిలాండ్‌, శ్రీలంక ప్రభుత్వాలు కూడా భారతీయులకు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని కల్పించాయి. నవంబర్‌ 10 నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చిన థాయిలాండ్‌ .. వచ్చే ఏడాది మే 10వరకు ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరోవైపు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అక్టోబర్‌ నెలలోనే భారతీయులకు అనుమతినిచ్చిన శ్రీలంక .. వచ్చే ఏడాది మార్చి 31వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news