జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న మణిపుర్ లో దాదాపుగా మూడు నెలలుగా హింస చెలరేగుతోంది. ఈ హింసలో ఇప్పటి వరకు దాదాపు 160కి పైగా మంది మరణించారు. మరోవైపు ఆ రాష్ట్రం రావణకాష్టంలా మారుతోంది. అక్కడి మహిళలపై ఆకృత్యాలు.. అఘాయిత్యాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మణిపుర్ ప్రజలకు తాను మద్దతుగా నిలుస్తానంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందుకు వచ్చారు.
స్థానికంగా శాంతి స్థాపనకు ముందుకు రావాలని మమతా బెనర్జీ .. మణిపుర్‌వాసులకు పిలుపునిచ్చారు. మానవత్వం కోసం ఈ దిశగా అడుగేయాలని విజ్ఞప్తి చేశారు. మణిపుర్‌లో వెలుగుచూస్తున్న హృదయ విదారక ఘటనలు కలచివేస్తున్నాయని.. ద్వేషాగ్నులను ఎప్పుడూ సహించకూడదని చెప్పారు. అధికారంలో ఉన్నవారు మౌనంగా ఉన్న నేపథ్యంలో.. ‘ఇండియా’ కూటమి ఈ గాయాలకు ఉపశమనం కలిగిస్తుందని భరోసానిచ్చారు. మానవత్వపు జ్వాలని మళ్లీ ప్రజ్వలింపజేస్తుందని అన్నారు. అచంచలమైన మద్దతు అందజేస్తూ.. మేమంతా మీవైపే నిలబడతాం’ అని మణిపుర్ పౌరులనుద్దేశించి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.