జాతుల మధ్య వైరం మణిపుర్‌లో మారణహోమం సృష్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఘర్షణ మొదలవుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి క్వక్తా, కాంగ్వై ప్రాంతాల్లో ఘర్షణ జరిగింది. పలు ప్రాంతాల్ల గుంపులు గుంపులుగా దాడులకు తెగబడుతుండటంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
స్థానిక అడ్వాన్స్ హాస్పిటల్ సమీపంలోని ప్యాలెస్ కాంపౌండ్ వద్ద ఒక మూక నిప్పంటించడానికి ప్రయత్నించింది. ఆ మూకలో దాదాపు వెయ్యిమంది వరకు ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి. మణిపుర్ విశ్వవిద్యాలయం సమీపంలో, తొంగ్జు ప్రాంతంలోని ఓ ఎమ్మెల్యే ఇంటి వద్ద వందల మంది గుమిగూడి ఇదే తరహాలో దాడికి యత్నించారని వెల్లడించారు. అలాగే మరో 300 నుంచి 400 మంది గుంపుగా వచ్చి ఇంఫాల్ సమీపంలోని ఇరింగ్‌బామ్ పోలీస్ స్టేషన్‌లోని ఆయుధాలను లూటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. అక్కడి వారికి ఎలాంటి ఆయుధాలు లభ్యం కాలేదు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ దాడుల్ని భగ్నం చేస్తున్నాయి.