మణిపుర్‌లో కుకీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రకటించిన హుయిరేమ్ హెరోదాస్ మైతేయ్ ఇంటిని కొందరు గ్రామస్థులు టైర్లతో కాల్చేశారు.
మణిపుర్‌లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు హుయిరేమ్(32)ని వీడియో ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. మణిపుర్‌లో మే 3నుంచి ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం ఉంది. అందుకే ఇన్ని రోజులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రాలేదని తెలుస్తోంది. తాజాగా వీడియో వైరల్ కావడం వల్ల భయంతో కుటుంబాన్ని వేరే చోటుకు తరలించి.. తాను మాత్రం మరో చోట తలదాచుకున్నాడు. బుధవారం రాత్రి థౌబల్ జిల్లాను జల్లెడ పట్టిన పోలీసులు.. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్లు గురువారం సాయంత్రం ప్రకటించారు.