ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్నారు. 15వ బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశానికి వెళ్లనున్నారు. ఆ దేశ రాజధాని జోహన్నెస్‌బర్గ్‌లో 22-24 మధ్య సమావేశం కానున్నాయి బ్రిక్స్ సభ్య దేశాలు. ఈ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్నాయి. సభ్యదేశాల్లో ఒకటైన రష్యా.. ఉక్రెయిన్‌పై ఏడాదిన్నరగా యుద్ధం చేయడం, భారత్-చైనాల మధ్య పలు అంశాల్లో ఘర్షణ వాతావరణం, దక్షిణాఫ్రికా ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న సమయంలో ఈ సభ్యదేశాలన్నీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే, ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వ్యక్తిగతంగా పాల్గొనడం లేదని దక్షిణాఫ్రికా ఇటీవలే వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు మినహా.. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. మరోవైపు.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ద్వైపాక్షిక చర్చల షెడ్యూల్‌పై ప్రస్తుతం ఖరారు చేస్తున్నామని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వత్రా చెప్పారు.