ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ లేకుండా.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) పరిపూర్ణం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరిన మోదీ ప్రముఖ ఫ్రెంచ్ డెయిలీ లెస్ ఎకోస్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అంతర్జాతీయ వేదికపై భారత్ పోషిస్తున్న కీలక పాత్రను మరోసారి వివరించారు. పేద దేశాల ఎదుగుదలకు భారత్ వేదిక లాంటిదని అన్నారు.
‘‘అత్యధిక జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్.. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం కానప్పుడు ఆ మండలి ప్రపంచం కోసం ఎలా మాట్లాడగలదు? ఐరాస భద్రతా మండలిలో ఎలాంటి మార్పులు జరగాలి? ఇందుకోసం తాము ఎలాంటి పాత్ర పోషించాలి అన్నదానిపై భారత్‌తో సహా చాలా దేశాలు స్పష్టంగా ఉన్నాయి” అని మోదీ తెలిపారు. మరోవైపు మోదీ జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో భాగంగా జరిగే బాస్టిల్ డే పరేడ్లో మోదీ పాల్గొననున్నారు.