మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ

-

లోక్​సభ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశంలో చంద్రయాన్-3 విజయంపై చర్చిస్తున్నారు. సభ మొదలవ్వగానే ముందుగా ప్రధాని మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రధాని ప్రసంగించారు.

భారత పార్లమెంటరీ ప్రయాణంలో బుధవారం నాటి సమావేశం ఓ సువర్ణ అధ్యాయమని.. ఆ చారిత్రక క్షణంలో ఈ సభా సభ్యులంతా భాగమయ్యారని మోదీ ఉద్ఘాటించారు. నారీ శక్తి గతిని మార్చడంలో మనం ఇప్పుడు చివరిమెట్టుపై ఉన్నామని… రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత దాన్ని కూడా దాటేస్తామని తెలిపారు. ఈ మార్పుతో కొత్త శక్తి ఆవిర్భవిస్తుందని.. దేశం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని చెప్పారు. ఈ బిల్లుకు మద్దతిచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలని మోదీ తెలిపారు. మోదీ ప్రసంగం తర్వాత లోక్‌సభలో చంద్రయాన్‌-3 విజయంపై చర్చ జరుగుతోంది.

చంద్రయాన్‌-3 విజయానికి కృషి చేసిన ఇంజినీర్లను స్పీకర్‌ ఓం బిర్లా కొనియాడారు. చంద్రయాన్‌-3 విజయం సాధించిన కొన్ని రోజులకే ఆదిత్య-ఎల్‌1 ప్రయోగించామని.. సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య-ఎల్‌1 ప్రయోగించామని చెప్పారు. ‘సూర్యుడిపై అధ్యయనానికి ప్రయోగించిన తొలి మిషన్‌ ఆదిత్య-ఎల్‌1. చంద్రయాన్‌-3లో అధికసంఖ్యలో మహిళలు భాగస్వామ్యం అయ్యారు. ఇవాళ అంతర్జాతీయ శాంతి దివాస్‌ను జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ శాంతిని భారత్‌ కాంక్షిస్తోంది’ అని ఓం బిర్లా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news