మధ్యప్రదేశ్‌లో నూతనంగా బీజేపీ సర్కార్ కొలువు దీరింది. భోపాల్ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఇవాళ మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ మంగూబాయ్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీశ్ దేవ్డా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు మరికొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే తదితరులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారానికి ముందు మోహన్ యాదవ్ భోపాల్‌లోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. గతనెల 17వ తేదీన 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లల్లో గెలిచి మరోసారి అధికారం నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ఎన్నుకుంటుందో అని ఇన్నాళ్లుగా సాగిన ఉత్కంఠకు తాజాగా తెర దించింది హైకమాండ్. మోహన్ యాదవ్ పేరును ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకుంది.