హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. ఇవాళ (సెప్టెంబరు 28) ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేసిన విషయం తెలిసిందే. ఆయన తన పరిశోధనలతో వరి వంగడాలు సృష్టించారు. వ్యవసాయం రంగంలో స్వామినాథన్ చేసిన కృషిని భారత ప్రభుత్వం గుర్తించి సత్కరించింది. ఆయన సేవలకు గానూ.. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామన్ మెగసెసె లాంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.
స్వామినాథన్ 1925 ఆగస్టు7న మద్రాసులో జన్మించారు. మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత స్వామినాథన్ మెడికల్ స్కూల్లో చేరారు. కానీ, 1943లో బెంగాల్‌లో చోటుచేసుకున్న కరువును కళ్లారా చూసిన ఆయన తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగువేశారు. త్రివేంద్రంలోని మహారాజా కాలేజీలో జువాలజీ నుంచి డిగ్రీ పట్టా పొందిన ఆయన.. ఆ తర్వాత మద్రాసు అగ్రికల్చరల్ కాలేజీలో చేరారు. అగ్రికల్చరల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI)లో పీజీ చదివారు. అలా వ్యవసాయ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు.