ముంబయిలో ప్రఖ్యాత లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టీటీ) రైల్వే స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ ఫాం 1కు సమీపంలో రైల్వే స్టేషన్‌లోని క్యాంటీన్‌లో ఇవాళ మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చుట్టుపక్కలకు వ్యాపించాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని ప్లాట్‌ఫాం నంబర్ 1 వెంబడి ఓవర్ హెడ్ వైర్లకు విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
“ఎల్‌టీటీ రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని టికెట్ బుకింగ్ కేంద్రంపై తొలి అంతస్తులోని జన్ ఆహార్ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 2.45గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సమయంలో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. ఆ సమయంలో ప్లాట్‌ఫాం నంబర్ 1లో ప్యాసింజర్ రైళ్లు లేవు. ఈ ఘటన నేపథ్యంలో టికెట్ బుకింగ్ కౌంటర్లు, అనౌన్స్‌మెంట్ సెంటర్లను ఖాళీ చేయించి అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాం. అగ్నిమాపక సిబ్బందితో పాటు ముంబయి పోలీసులు, ఇతర విభాగాలకు చెందిన భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మధ్యాహ్నం 3.30గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చాం.” అని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో వెల్లడించారు.