మహారాష్ట్రలో ఇటీవల ఓ మైనర్ ర్యాష్ డ్రైవింగ్.. రెండు నిండు ప్రాణాలను బలిగొన్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయినా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ముంబయిలో ఈ తరహా ఘటనే చోటుచేసుకొంది. ఒక మైనర్ బాలుడు లగ్జరీ కారు నడుపుతుండగా.. మరో వ్యక్తి వాహనం ముందు బానెట్‌పై కూర్చున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
ముంబయి రద్దీ ప్రాంతాల్లో ఒకటైన శివాజీ చౌక్ వద్ద ఓ మైనర్ బీఎమ్‌డబ్ల్యూ కారు నడిపాడు. అతడు డ్రైవింగ్ చేస్తుండగా.. సుభమ్ మితాలియా అనే మరో యువకుడు దర్జాగా కారు బానెట్‌పై కూర్చుని వీడియోకు ఫోజులిచ్చాడు. ఇది చూసి అక్కడున్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో స్పందించిన పోలీసులు.. బాలుడి తండ్రిని అరెస్టు చేశారు. అతడితో పాటు వీడియోలో కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిర్లక్ష్య డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.