టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ పిసిసి మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు నిన్న ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 1988లో రోడ్డుపై గొడవ పడిన ఘటనలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ కొట్టారు. ఆయన కొట్టిన దెబ్బలు గుర్నామ్ తలకు బలంగా తాకడంతో ఆయన చనిపోయారు. ఈ కేసులో నే సిద్ధూ కు సుప్రీం కోర్టు శిక్ష విధించింది. మరోవైపు తాను లొంగిపోవడానికి కొన్ని వారాల సమయాన్ని ఇవ్వాలని సుప్రీం కోర్టును సిద్దు కోరారు.
తనకు ఆరోగ్యం బాగోలేదని.. ఈ కారణం వల్ల తనకు కొన్ని వారాల సమయం ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. సిద్ధూ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో వాదనలు జరిగాయి. క్రైమ్ జరిగి ఇప్పటికి 34 ఏళ్లు గడిచిపోయాయి అని.. సుప్రీం కోర్టు శిక్ష విధించడం కూడా జరిగిందని.. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వారాల సమయం కావాలని అడగడం సరి కాదని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సింఘ్హ్వి తన వాదన వినిపిస్తూ.. తన క్లయింట్ లొంగిపోతారు అనే చెబుతున్నారని, కేవలం కొంత సమయాన్ని మాత్రమే అడుగుతున్నారని కోర్టుకు తెలిపారు. సమయాన్ని ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది కోర్టు నిర్ణయమని అన్నారు.