హర్యానా లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనను నూతన సీఎంగా ఎన్నుకున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు వెల్లడించారు. ప్రస్తుతం సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈ క్రమంలోనే పలువురు నేతల పేర్లు తెరపైకి రాగా.. చివరకు నాయబ్ సైనీ వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఈయన ఖట్టర్ కి అత్యంత సన్నిహితుడు. ఓబీసీ వర్గానికి చెందిన సైనీ 1996లో భాజపాలో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. పార్టీలో పలు పదవులు చేపట్టారు. 2014లో నారాయణఢ్ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 3.83లక్షల మెజార్టీతో విజయం సాధించారు. గతేడాది అక్టోబరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.