మూడు కూనలకు జన్మనిచ్చిన నమీబియా చీతా

-

ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఇప్పటికే పది వరకు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు కొన్ని చీతాలు మృత్యువాత చెందుతున్నా.. మరికొన్ని చీతాలు మాత్రం వాటి సంతానాన్ని పెంచుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో ఉన్న ‘జ్వాల’ అనే చీతా మూడు కూనలకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని కేంద్రమంత్రి భూపేందర్‌ యాదవ్‌  ‘ఎక్స్‌’(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. జ్వాల’ మూడు పిల్లలకు జన్మనిచ్చిందని.. ఇటీవలే ‘ఆశా’ కూడా కూనలకు జన్మనిచ్చిందని తెలిపారు. చీతాల సంఖ్యలో ఈ పరిణామం హర్షణీయమని ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల ప్రేమికులందరికీ అభినందనలు తెలియజేశారు. వీటి సంఖ్య మరింత వృద్ధి చెందాలని ఆశిస్తున్నానని భూపేందర్ యాదవ్ ఓ వీడియోను షేర్‌ చేశారు.

భారత్‌లో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా 2022లో నమీబియా నుంచి భారత్‌కు ఎనిమిది, రెండో విడతలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version