దిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఐసిస్ (ISIS) మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహమ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజామాను అరెస్టు చేసింది. దిల్లీలో ఇతడు ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్లు ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. మహమ్మద్ వివరాలు వెల్లడించిన వారికి రూ.3 లక్షల రివార్డును కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం దిల్లీ మాడ్యుల్ ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేసి రాబట్టిన సమాచారం ఆధారంగా షానవాజ్‌ను బంధించినట్లు అధికారులు వెల్లడించారు. దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన షానవాజ్ పుణే ఐసిస్ మాడ్యుల్ కేసులో కీలక నిందితుడని ఎన్‌ఐఏ అధికారులు చెప్పారు. ఇతడు పుణే పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని వచ్చి దిల్లీలో ఉంటున్నాడని.. ఇప్పటికే ఐసిస్ అనుమానితులుగా అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులతో కలిసి షానవాజ్‌ను విచారిస్తున్నట్లు తెలిపారు. ఇతడి వద్ద నుంచి ఐఈడీలను తయారు చేయడానికి ఉపయోగించే పలు రసాయనాలను స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడించారు.