ఐటీ ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని జాతీయ పోషకాహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఒత్తిడితో కూడిన పనివిధానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడం ద్వారా పలు రోగాలను కొనితెచ్చుకుంటున్నారని ఎన్‌ఐఎన్ హెచ్చరించింది. హైదరాబాద్ నగర కేంద్రంగా ప్రముఖ ఐటీ సంస్థల్లో పని చేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై అధ్యయనం చేయగా ఆ వివరాలు అంతర్జాతీయ పీర్ రివ్యూడ్ జర్నల్ ‘న్యూట్రియంట్స్’ ఆగస్టు 2023 సంచికలో ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనం 46 శాతం మంది జీవనశైలి వ్యాధులబారిన పడే ప్రమాదంలో ఉన్నారని తేల్చి చెప్పింది. ప్రతి 10 మందిలో ముగ్గురు రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులబారిన పడుతున్నారని పేర్కొంది. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను అలవర్చడానికి ప్రతి ఐటీ సంస్థలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎన్‌ఐఎన్ అభిప్రాయపడింది. తరచూ ఆరోగ్య పరీక్షలు చేసి.. తదనుగుణంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చవచ్చని పేర్కొంది.