కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ సర్కారు తొలిసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు పార్లమెంటు ఇవాళ సమావేశం అయింది. ఈ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. దివంగత వియత్నాం నాయకుడు గుయెన్ ఫు ట్రోంగ్(80)కు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. బంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా నీట్ అక్రమాలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై రచ్చ జరిగింది.
అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2023-24 లోక్సభలో ప్రవేశపెట్టారు. సర్వే వివరాలను వెల్లడిస్తున్నారు. ఇక ఇవాళ్టి సమావేశాల తర్వాత తిరిగి మంగళవారం రోజున సమావేశాలు కొనసాగనున్నాయి. మంగళవారం రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ మిగిలిన 8 నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో 6 బిల్లులను సభ ఆమోదం కోసం కేంద్రం తీసుకురానుంది.