వచ్చే ఏడాది చివరి నాటికి రాజస్థాన్‌లోని రహదారులు అమెరికాను తలపించేలా ఉంటాయని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. త్వరలోనే రాజస్థాన్ సంతోషకర, సుసంపన్నమైన రాష్ట్రంగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హనుమగఢ్ జిల్లాలోని పక్క షర్న గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ‘సేతు బంధన్’లో భాగంగా రూ.2,050 కోట్ల వ్యయంతో ఆరు జాతీయ హైవేలు, ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
‘అమెరికా రోడ్లు బాగున్నాయంటే అందుకు అమెరికా ధనిక దేశం అయినందువల్ల కాదు. రోడ్లు బాగున్నాయి కాబట్టే ఆ దేశం సుసంపన్నమైందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్.ఎఫ్. కెన్నడీ చెప్పారు. ఆ మాటల్ని నేను ఎప్పుడూ చెబుతుంటాను. 2024 చివరి నాటికి రాజస్థాన్‌లోని రోడ్లు అమెరికా రహదారులతో సమానంగా ఉంటాయని నేను హామీ ఇస్తున్నా. ప్రభుత్వాలు మారితే సమాజం మారుతుంది. పేదరికం, ఆకలి, నిరుద్యోగం నుంచి విముక్తి కలగాలి’ అని గడ్కరీ ఆకాంక్షించారు.