భారత్ వేదికగా దిల్లీలో అత్యంత ప్రతిష్ఠాత్మంగా జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. 19 దేశాలకు చెందిన అతిథుల రాక మొదలైంది. ఈ క్రమంలో అతిథులతో పాటు మాజీ ప్రధానులు, కేంద్రమంత్రులకు జీ20 విందుకు ఆహ్వానం అందింది. అయితే శతాధిక పార్టీ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేకు మాత్రం ఆహ్వానం రాలేదు. ఈ విషయాన్ని ఖర్గే కార్యాలయం ధ్రువీకరించింది. దిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపంలో ఈ విందు జరగనుంది. దీంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
శనివారం రోజున రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఈ విందు ఇవ్వనున్నారు. కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ విందు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఏ రాజకీయ పార్టీకి చెందిన నేతకు ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిలో భాగంగానే కేబినెట్ హోదా కలిగిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన ఖర్గేకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.